ఈ మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదు!

  • మూత్రంలో రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
  • తరచూ మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా వదిలేయొద్దు
  • క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తేనే ప్రయోజనం
  • 50 ఏళ్లు దాటిన వాళ్లు, పొగతాగే వాళ్లు అలర్ట్‌గా ఉండాలి
చాలా మంది మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటుంటారు. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. డీహైడ్రేషన్, ఒత్తిడి, వయసు మీదపడడం లేదా ఏదైనా చిన్న ఇన్‌ఫెక్షన్ అయ్యుంటుందిలే అనుకొని వదిలేస్తుంటారు. కానీ, అది చాలా ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

మూత్రాశయం, కిడ్నీ, ప్రోస్టేట్, గర్భాశయ ముఖద్వారం వంటి యూరినరీ ట్రాక్ట్ సంబంధిత క్యాన్సర్లు తేలికపాటి లక్షణాలతోనే మొదలవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ముదిరే వరకు వాటి తీవ్రత తెలియదు. కానీ, నెలల తరబడి వాటిని అలాగే వదిలేస్తే క్యాన్సర్ మరింత వ్యాపించి చికిత్స కష్టమవుతుంది. కిడ్నీ, బ్లాడర్ క్యాన్సర్లను మొదట్లోనే గుర్తిస్తే సులభంగా నయం చేసేందుకు అవకాశం ఉంటుంది.

మూత్రంలో రక్తం వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మంట, నొప్పి లేకపోయినా ఈ లక్షణాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. దీంతో పాటు తరచూ మూత్రం రావడం, మూత్రం పోసేటప్పుడు మంట, మూత్రం ఆపుకోలేకపోవడం, మూత్రం నెమ్మదిగా రావడం, రాత్రి పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపు కింద లేదా వెన్నెముక కింది భాగంలో నిరంతర నొప్పి వంటి లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలి.

మూత్రాశయం లేదా మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్ సమయంలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే వీటితో పాటు శరీరంలో ఇంకేమైనా మార్పులు గమనిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

క్యాన్సర్లను తొందరగా గుర్తిస్తే సగం చికిత్స పూర్తి చేసినట్లే. లేదంటే అది దగ్గర్లోని ఇతర అవయవాలు, లింఫ్ నోడ్స్ సహా ఇతర ఆర్గాన్స్‌కూ వ్యాపించి చికిత్స చేయడం కష్టంగా మారుతుంది. ప్రారంభ దశలో గుర్తిస్తే రేడియేషన్‌ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ సోకిన కణాలనే లక్ష్యంగా చేసుకొని నయం చేయొచ్చు. ఇతర అవయవాలకు వ్యాపిస్తే మాత్రం చికిత్స ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.

అలా అని ప్రతీ లక్షణం క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని రోజుల పాటు నిరంతరం ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. 50 ఏళ్లు దాటిన వాళ్లు, పొగతాగే వాళ్లు, పరిశ్రమల్లో కెమికల్స్‌తో పనిచేసేవాళ్లు, ఇంట్లో యూరినరీ క్యాన్సర్ల చరిత్ర ఉన్నవాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

Urinary Tract Cancer
Kidney Cancer
Bladder Cancer
Urine Problems
Urology
Health Warning
Cancer Symptoms
Prostate Cancer
Uterine Cancer

More Telugu News